సాధారణంగా గోవర్ధన పర్వతం అంటే చాలా ఎత్తుగా నిలబడి వుంటుంది అనుకుంటారు. కాని గోవర్థనగిరి పడుకున్న పర్వతం, ఎత్తు తక్కువగా వుంటుంది. చుట్టు కొలత మాత్రం 11కి.మి. ఉంటుంది. గోవర్ధన పర్వతాన్ని చూడకపోయిన దాని గురుంచి తెలియని వారు వుండరేమో. బృందావనంలో నివసిస్తున్న సమయంలో కృష్ణుడు, గోపాలులు ఆచరిస్తున్న ఇంద్రయాగాన్ని ఆపించి, గోవర్ధన గిరికి పూజ చేయిస్తాడు. కోపగించిన ఇంద్రుడు ప్రళయ భయంకర మైన రాళ్ళవానతో బృందావన ప్రజలను ముంచేస్తాడు. అప్పుడు చిన్నికృష్ణుడు చిటికెన వేలుమీద గోవర్ధన గిరి ఎత్తి పట్టుకుని ఊరి వారికి రక్షణ కల్పించాడు. వరుసగా ఏడు (7) రోజులు కృష్ణుడు అలా గోవర్ధన గిరిని పట్టుకునే వున్నాడు. దీనికి గుర్తుగా వైష్ణవ సంప్రదాయులు ఇప్పటికి దీపావళి మరుసటి రోజుని గోవర్ధన పూజ చేస్తారు. భక్తుల దృష్టిలో గోవర్ధన పర్వతం కృష్ణుడికి భిన్నమైనదేమి కాదు. గోపజనులను, గోవులను కాపాడిన కృష్ణుడు ఆ రోజు నుండి గోవిందుడు అయ్యాడు. గిరిని ఎత్తి గిరిధారి అయ్యాడు.

ఢిల్లీ నుండి కొద్ది దూరంలో మధుర దగ్గరలో బృందావనం ఉంది. గోవర్ధన పర్వతం బృందావన్ నుండి 22కి.మి దూరంలో వుంటుంది. బస్సులు, ఆటోలు వెళుతుంటాయి. దారిలో రాధాకుండ్ వుంది. రాధాకుండ్ నుండి 5కి.మి దూరంలో వుంటుంది గోవర్ధన పర్వతం. ఇక్కడ ఒక చిన్న ఊరులా వుంటుంది. ఈ ఊరినీ గోవర్ధన్ పేరుతోనే పిలుస్తారు. 
 
గోవర్ధన పర్వతం వున్న చోట గోవర్ధన మందిరం వుంది. అందరూ అక్కడ దర్శనం చేసుకునే ప్రదక్షిణ మొదలుపెడతారు. అక్కడ ఒక దగ్గర కృష్ణుడి విగ్రహం, మరో దగ్గర చిన్న గోవర్ధన పర్వత నమూనాలో గుడి వున్నాయి. భక్తులు కూడా బాగానే వుంటారు. గోవర్ధన గిరి ప్రదక్షిణ ఇక్కడ ఒక చోటునుండి మొదలవుతుంది, సుమారు 11 కి.మీ, కొనసాగుతుంది.
 
గోవర్ధన గిరి పర్వతం ప్రదక్షణ కొందరు చెప్పులతో మరికొందరు చెప్పులు లేకుండా చేస్తారు. చిన్న పిల్లలు ,వృద్ధులు, పెద్ద వాళ్ళు అని తేడా లేకుండా గోవర్ధన గిరి ప్రదక్షణ చేస్తూ ఉంటారు.
గోవర్ధన గిరి ప్రదక్షిణ ఎవరికి వారే చేయడమే కాకుండా కుటుంబం లోని వాళ్లు సమిష్టిగా ప్రదక్షిణ చేస్తారు అంటే ఒక కుటుంబంలోని భార్య ,భర్త ,పిల్లలు ఉంటే భార్య సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత నుండి భర్త  ప్రదక్షిణ మొదలు పెడతారు. అలా పిల్లలు  ప్రదక్షిణ సమిష్టిగా  పూర్తి చేస్తారు.