పూర్వం నిష్ఠురి అనే మహిళ వుండేది. ఆమె ప్రవర్తన హేయంగా వుండటంతో ఆమెను కర్కశ అని అందరూ అంటుండేవారు. కాశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడిని పెళ్ళాడింది.
 

ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను హింసించి., భయంకరమైన వ్యాధితో దీనస్థితిలో మరణించాడు. ఆ పాప ఫలితంగా మరుసటి జన్మలో శునకంగా జన్మించింది. ఆమెకు ఓ కార్తీక సోమవారం నాడు పగటిపూట ఎక్కడా ఆహారం దొరకలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం వుండి సాయం సంధ్యా సమయంలో వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం అన్నం ముద్దను ఇంటి ముంగిట వుంచాడు.

ఆహారం దొరకని ఆ శునకం ఆ అన్నం ముద్దను తింది. వెంటనే దానికి గత జన్మ జ్ఞప్తికి వచ్చింది. దాంతో మానవ భాషలో వేద పండితుడికి గతాన్ని చెప్పింది.


అంతా తెలుసుకుని కార్తీక సోమవారం నాటు పగటి పూట అంతా ఏమీ తినకుండా ఉపవాసం వుండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదం లాంటి అన్నం ముద్దను తీసుకున్న కారణంగా శునకానికి గత జన్మ గుర్తుకు వచ్చిందని గుర్తించాడు. ఇదే విషయాన్ని శునకానికి చెప్పాడు. దాంతో తనకెలాగైనా మళ్లీ పుణ్యం లభించేలా అనుగ్రహించమని వేడుకుంది.

ఎన్నెన్నో సోమవార వ్రతాలను చేసి పుణ్యం సంపన్నుడైన ఆ పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి ధార పోశాడు. వెంటనే శునక దేహాన్ని విడిచిపెట్టి దివ్య శరీరంతో కైలాసానికి చేరింది. ఇది స్కంధ పురాణంలో చెప్తున్న సోమవారం వ్రత కథ. ఈ వ్రతాన్ని చేసిన వాడికి కైలాస నివాసం లభిస్తుంది. కార్తీక సోమవారం నాడు చేసిన స్నానం, దానం, జపం అనేవి అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్నిస్తుంది.

ఉపవాసం: ఉపవాసం చేయగలిగిన వారు కార్తీకసోమవారం రోజున పగలు అంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసీతీర్థం మాత్రమే స్వీకరించాలి.

ఏకభుక్తం: రోజంతా ఉపవాసం ఉండలేనివారు ఉదయం యథావిధిగా స్నానం, జపం ముగించుకుని, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో, తులసీతీర్థమో స్వీకరించాలి.

నక్తం : సోమవారం రోజున పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి.


అయాచితం : భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారంతట వారే భోజనానికి ఆహ్వానిస్తే, భోజనం మాత్రమే చేయాలి. దీన్నే అయాచితం అని అంటారు.


స్నానం : పైన పేర్కొనబడిన వాటిల్లో వేటినీ చేసే శక్తిలేనివారు నమంత్రక స్నానం, జపం చేస్తే సరిపోతుంది.


తిలాపాపం : మంత్రం, జపం విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీకసోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

పైన చెప్పిన ఆరు పద్ధతులలో ఏ ఒక్కటి ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది

కార్తీకసోమవారం రోజున శివాలయాలలో నేతితో దీపం వెలిగించేవారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. సోమవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఆలయాలలో పంచముఖ దివ్వెలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభఫలితాలను పొందగలరు. కార్తీకసోమవారం బ్రాహ్మీముహూర్తంలో స్నానం చేసి శివుణ్ణి స్తుతిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలను పొందుతారు. శివానుగ్రహం కోసం పేదలకు సహాయం చేయడం, ఉపవాసం, సత్యనిష్టతో ఉండటం చాలా ముఖ్యం